29
నిబంధన పునరుద్ధరణ
యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.
మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు. “యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా, అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు. అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు.
నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు. మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు.
మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము. కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి.
10 మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ, 11 అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకుని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు. 12 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా 13 ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు.
14 నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో 15 ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను. 16 మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు. 17 వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు.
18 ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు. 19 అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు.
20 యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు. 21 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి * 29:21 అతణ్ణి మిగతా వారికోసం ఒక గుణపాఠం గా చేస్తాడు. వెళ్ళ గొట్టేస్తాడు.
22 కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు. 23 యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి, 24 వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు.
25 అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు. 26 తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు. 27 కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది.
28 యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.’
29 రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”

*29:21 29:21 అతణ్ణి మిగతా వారికోసం ఒక గుణపాఠం గా చేస్తాడు.