సంఖ్యా కాండము
గ్రంథకర్త
సర్వజనీనంగా యూదు, క్రైస్తవ సంప్రదాయాలు సంఖ్యాకాండం గ్రంథ కర్తృత్వాన్ని మోషేకు ఆపాదించాయి. ఈ పుస్తకంలో అనేక గణాంకాలు, జనాభా లెక్కలు, గిరిజన, యాజక వివరాలు ఉన్నాయి. ఈజిప్టునుంచి నిర్గమనం తరువాత 2 వ సంవత్సరం నుండి 40 వ సంవత్సరం వరకు 38 సంవత్సరాల కాలాన్ని ఈ గ్రంథం వివరిస్తున్నది. అంటే సీనాయి దగ్గర విడిసి ఉన్న సమయం మొదలుకొని, కొత్త తరం వాగ్దాన భూమిలో ప్రవేశించే దాకా. అంతే గాక నిర్గమం తరువాత రెoడవ, నలభయ్యవ సంవత్సరాల్లో జరిగిన వాటికే ఈ గ్రంథం ప్రాధాన్యతనిచ్చింది. మధ్యలో వారు అరణ్య సంచారం చేసిన 38 సంవత్సరాల గురించి పెద్దగా సమాచారం లేదు.
రచనా కాలం, ప్రదేశం
ఇంచుమించు క్రీ. పూ 1445 - 1400
ఇశ్రాయేలీయులు ఈజిప్టు వదిలి వచ్చిన రెండవ సంవత్సరం అంటే ప్రజానీకం సీనాయి కొండవద్ధ ఉన్న సమయం (1:1).
స్వీకర్త
వాగ్దాన దేశానికి ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని గ్రంథస్థం చేయడానికి ఆ ప్రజల కోసం రాసిన గ్రంథమిది. అంతే గాక దేవుని ప్రజల పరలోక ప్రయాణంలో ఆయన వారిలో ఉంటాడని ఈ గ్రంథం తెలుపుతున్నది.
ప్రయోజనం
రెండవ తరం వాగ్దాన దేశంలోకి ప్రవేశించటానికి సిద్ధమైన తరుణంలో మోషే సంఖ్యాకాండం రాశాడు. (సంఖ్యా 33:2). దేవుని వాగ్ధానాన్ని విశ్వాసంతో స్వంతం చేసుకొమ్మని ఆ తరాన్ని ప్రోత్సహించడం ఈ గ్రంథం ఉద్దేశం. దేవుని షరతులు లేని నమ్మకత్వాన్ని కూడా సంఖ్యాకాండం వెల్లడిస్తుంది. మొదటి తరం నిబంధన ఆశీర్వాదాలను తిరస్కరించగా దేవుడు మాత్రం తన నిబంధనకు కట్టుబడే ఉన్నాడు. ప్రజల ఫిర్యాదులు, తిరుగుబాటులు అలా ఉన్నప్పటికి ఆయన ఆ జాతిని దీవిస్తూనే, రెండవ తరానికి ఆ దేశాన్ని ఇస్తానన్న వాగ్ధానానికి కట్టుబడే ఉన్నాడు.
ముఖ్యాంశం
ప్రయాణాలు
విభాగాలు
1. వాగ్దాన దేశం ప్రయాణ సన్నాహాలు — 1:1-10:10
2. సీనాయి నుండి కాదేషుకు ప్రయాణం — 10:11-12:16
3. తిరుగుబాటు మూలంగా ఆలస్యం — 13:1-20:13
4. కాదేషుకు నుండి మోయాబు మైదాన భూమికి ప్రయాణం — 20:14-22:1
5. మోయాబులో ఇశ్రాయేల్ వాగ్దాన భూమి ఆక్రమణకు సన్నాహాలు — 22:2-32:42
6. వివిధ అంశాల నిర్వహణ — 33:1-36:13
1
జనాభా లెక్కలు
యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు. ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి. మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు, షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు, యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను, ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
10 యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు, 11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను, 12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు, 13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు, 14 గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు 15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
16 వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు * 1:16 వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు.పెద్దలుగానూ ఉన్నారు.
17 ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు. 18 వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు. 19 అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
20 ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 21 అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
22 షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 23 అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
24 గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 25 అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.
26 యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 27 అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.
28 ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 29 అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
30 జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 31 అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
32 యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 33 అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
34 మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 35 అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
36 బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 37 అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
38 దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 39 అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
40 ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 41 అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
42 నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు. 43 అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
44 ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు. 45 ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు. 46 వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
47 కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు. 48 ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు. 49 “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
50 వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.
51 గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి. 52 ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
53 నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.” 54 ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.

*1:16 1:16 వెయ్యి మందికి నాయకులుగా ఉన్నారు.