పరమ గీతము
గ్రంథకర్త
ఈ గ్రంథం శీర్షికను దీని మొదటి వచనంలో నుండి తీసుకున్నారు. “సొలొమోను రచించిన పరమగీతం” (1:1). ఈ గ్రంథంలో సొలొమోను పేరు పదేపదే కనిపించడంలో (1:5; 3:7, 9, 16, 8:11-12) దీనికి సొలొమోను రాసిన పరమగీతం అనే పేరు స్థిరపడింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 971 - 930
సోలోమోను రాజుగా ఉన్న కాలంలో ఈ పుస్తకం రాశాడు. సోలొమోనే దీని రచయిత. అని అంగీకరించే పండితులు అతని పరిపాలన ఆరంభదశలో రచించాడని చెబుతారు. ఈ కథనంలో యువకవి ఉత్సాహం కనిపిస్తుంది. అంతే గాక తన సామ్రాజ్యానికి ఉత్తరాన, దక్షిణాన ఉన్న ప్రదేశాలు లెబానోను, ఈజిప్టు ప్రాంతాల పేర్లు ఇందులో కనిపిస్తాయి.
స్వీకర్త
వివాహితులు, వివాహం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రయోజనం
ఇది ప్రేమ మాధుర్యాన్నిపొగుడుతూ రాసిన గ్రంథం. వివాహమంటే దేవుని ప్రణాళికేనని ఈ గ్రంథం స్పష్టం చేస్తున్నది. స్త్రీ పురుషులు వివాహబంధంలో మాత్రమే కలిసి జీవించాలి. ఒకరినొకరు అధ్యాత్మికంగా, భావోద్రేకపరంగా, శారీరికంగా ప్రేమించుకోవాలి.
ముఖ్యాంశం
ప్రేమ, పెండ్లి
విభాగాలు
1. వధువు సొలొమోను గురించి తలపోయడం — 1:1-3:5
2. వధువు ప్రదానానికి అంగీకరించడం, వివాహానికై ఎదురు చూడడం — 3:6-5:1
3. వరుణి కోల్పోయినట్టు వధువు కల — 5:2-6:3
4. వధూవరులు ఒకరినొకరు ప్రశంసించుకోవడం — 6:4-8:14
1
సొలొమోను రాసిన పరమగీతం.
ప్రియమైన
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నీ నోటితో* 1:2 నీ నోటితో ఆయన నోటితో నాకు ముద్దులు పెడితే ఎంత బాగుండు.
నీ ప్రేమ ద్రాక్షారసం కంటే ఉత్తమం.
నువ్వు పూసుకునేవి ఎంతో సువాసన ఉన్న పరిమళ తైలాలు.
నీ పేరు ప్రవహిస్తున్న పరిమళం, అందుకే యువతులు నిన్ను ఇష్టపడతారు.
నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం.
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.)
రాజు, తన గదుల్లోకి నన్ను తెచ్చాడు.
(ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది.)
నేను సంతోషంగా ఉన్నాను. నీ గురించి నేను ఆనందిస్తున్నాను.
నీ ప్రేమను నన్ను ఉత్సవంలా జరుపుకోనీ.
అది ద్రాక్షారసం కంటే ఉత్తమం.
మిగతా స్త్రీలు నిన్ను పొగడడం సహజం.
(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది)
యెరూషలేము ఆడపడుచులారా, నేను నల్లటి పిల్లనే కానీ అందగత్తెను.
కేదారు డేరాల్లాగా, సొలొమోను రాజభవనం తెరల్లాగా నేను అందగత్తెను.
నల్లగా ఉన్నానని నన్ను అలా చూడొద్దు.
ఎండ తగిలి అలా అయ్యాను.
నా సోదరులు నా మీద కోపంగా ఉన్నారు.
నన్ను ద్రాక్షతోటలకు కావలిగా ఉంచారు.
అయితే నా సొంత ద్రాక్షతోటను నేను కాయలేదు.
(ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నా ప్రాణ ప్రియా! నీ మందను నీవెక్కడ మేపుతావో నాకు చెప్పు.
మధ్యాహ్నం నీ మందను నీడలో ఎక్కడ ఉంచుతావు?
నీ స్నేహితుల మందల దగ్గర అటూ ఇటూ తిరిగే దానిగా నేనెందుకుండాలి?
(తన ప్రియుడు ఆమెకు జవాబిస్తున్నాడు)
జగదేక సుందరీ, నీకు తెలియకపోతే నా మందల అడుగుజాడలను అనుసరించు.
కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లలను మేపుకో.
నా ప్రేయసీ, ఫరో రథపు గుర్రాల్లోని ఆడ గుర్రంతో నిన్ను పోలుస్తాను. 10 ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!
11 నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.
12 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది)
రాజు విందుకు కూర్చుని 1:12 విందుకు కూర్చుని మంచం మీద పడుకుని ఉంటే ఉంటే నా పరిమళం వ్యాపించింది.
13 నా ప్రియుడు నా స్తనాల మధ్య రాత్రంతా ఉండే బోళం సంచిలా ఉన్నాడు.
14 ఏన్గెదీ ద్రాక్షాతోటల్లో కర్పూరపు పూగుత్తుల్లాగా నాకు నా ప్రియుడున్నాడు.
15 (ఆమె ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు)
ప్రేయసీ, నువ్వు సుందరివి.
చాలా అందంగా ఉన్నావు.
నీ కళ్ళు అచ్చం గువ్వ కళ్ళే.
16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది)
నన్ను ప్రేమిస్తున్న నువ్వు అతిమనోహరుడివి.
అందగాడివి. పచ్చిక మనకు పాన్పు.
17 మన ఇంటి దూలాలు దేవదారు వృక్షం మ్రానులు.
మన వాసాలు సరళ వృక్షం మ్రానులు.

*1:2 1:2 నీ నోటితో ఆయన నోటితో

1:12 1:12 విందుకు కూర్చుని మంచం మీద పడుకుని ఉంటే