Psalms
కీర్తనల గ్రంథము
ప్రథమ పరిచ్ఛేదము
౧
౧ దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.
౨ అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.
౩ అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.
౪ దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.
౫ కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు.
౬ నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.