2 దినవృత్తాంతాలు
గ్రంథకర్త
యూదుల సంప్రదాయం ప్రకారం ఈ పుస్తకం రాసినది ఎజ్రా శాస్త్రి. ఇది సోలొమోను పరిపాలన వర్ణనతో ఆరంభం అవుతుంది. సోలొమోను మరణం తరువాత రాజ్యం రెండుగా చీలింది. ఇది 1 దినవృత్తాంత గ్రంథానికి జోడుగ్రంథం. సోలొమోను పాలన నుండి బబులోను చెర కాలం దాకా హెబ్రీ ప్రజల చరిత్రను ఇది ఆవిష్కరిస్తున్నది.
రచనా కాలం, ప్రదేశం
సూమారు క్రీ. పూ. 450 - 425
దినవృతాంత గ్రంథాల రచన కాలాన్ని నిర్ణయించడం దుర్లభం. అయితే ఇశ్రాయేలు బబులోను చెరనుండి తిరిగి వచ్చాక గ్రంథరచన జరిగిందనేది స్పష్టం.
స్వీకర్త
ప్రాచీన యూదా ప్రజలు, బైబిలు చదివేవారంతా.
ప్రయోజనం
2 దినవృత్తాంతాలు గ్రంథంలో స్థూలంగా 2 సమూయేలు, 2 రాజులు గ్రంథాల్లోని చరిత్రే ఉంటుంది. అయితే ఈ గ్రంథం ఆ కాలం నాటి యాజక వ్యవహారాలను ప్రత్యేకంగా పేర్కొంటున్నది. జాతి యొక్క మత చరిత్రను అంచనా వేయడం దీని ప్రత్యేకత.
ముఖ్యాంశం
ఇశ్రాయేలు ఆధ్యాత్మిక వారసత్వం.
విభాగాలు
1. సొలొమోను పాలన క్రింద ఇశ్రాయేలు — 1:1-9:31
2. రెహబాము నుండి ఆహాజు వరకు — 10:1-28:27
3. హిజ్కియా నుండి యూదా రాజ్య అంతం వరకు — 29:1-36:23
1
జ్ఞనం కోసం సొలొమోను దేవునికి ప్రార్థన
1:2-13; 1రాజులు 3:4-15
1:14-17; 1రాజులు 10:26-29; 2దిన 9:25-28
1 దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు.
2 సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. 3 అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.
4 దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు. 5 అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు. 6 సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
7 ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. “నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు” అన్నాడు.
8 సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. “నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు. 9 కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు. 10 ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.”
11 అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు. 12 కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.” 13 తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.
14 సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు. 15 రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.
16 సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండీ కవే ప్రాంతం నుండీ తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు. 17 వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండినీ, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండినీ ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకూ, సిరియా రాజులకూ కూడా ఎగుమతి చేశారు.